సాగులో కష్టాలు - వ్యవసాయ వార్తలు - కవిత్వం - సంగీతం

ఇది ఒక వ్యవసాయ అధికారి బ్లాగు. అందరు బ్లాగ్ చేయొచ్చు.

Tuesday, October 29, 2013

వరద కష్టాలు

వరద కష్టాలు

కనరాడు దినకరుడు
దినమె రేయిగ దోచె; నడిసంద్రములలో
జనవాసములలో జడి
వాన కురిసె, యలజడి వుప్పెనెగసే !
చెరువుల తలపించినవే
గరువున వేసిన పంటలు, గుండె పగులగా!
బరువగు సేద్యము, తధ్యము
కరువున నిను గాచుదెవరు కర్షక మిత్రా !
కరువులు వానలు వరదల
వెరువక కర్షక మిత్రులు వరి వేయుదురే
మరువక సాయము చేయుట
వరులకు భూసురులకు యది శోభనమేగా !
తడిసెను బియ్యము పప్పులు
తడియారదె కంట నీరు; తగ్గని వెతలే !
గుడిసెల జీవుల తిప్పలు
గుడిలో దేవుని కెరుకే కనుమా రామా !

జడివానల చేటుబడి
నడిసంద్రపు నావాయె జన జీవనమే
కడివెడు వెతలను దీర్చని
మడిగట్టిన యీ నేతల మరువుము సుమ్మీ !
తప్పవు వర్షపు తిప్పలు
తెప్పలు గొని తెచ్చుకున్న తీరున తంటా !
గొప్పలు చెప్పక నేతలు
చప్పున సాయము జేసిన చెల్లును వినరా !


27-10-2013                                                                  …… శనగల

Wednesday, October 2, 2013

గాంధి తిరిగి పుట్టినా బట్ట తిరిగి కట్టునా? కనుగొని యీ గాంధియిజం ? !

గాంధీఇజమా
ఛెళ్ళున చెంపలు పగులని
భళ్ళున రోడ్డునకీడ్చిన బలవంతముగన్
వెళ్ళుము చెల్లును దన్నుట
గళ్ళను బట్టుట నేడది గాంధియిజముగా !
రాముడు కాయడు జనులర
హీము కనిన యూరకొనును హతవిధి విధీ !
దేముడు యోహను జూడడు
యేముని మార్చగజాలరు యీగడ్సెయిజమున్ !
ఖద్దరు చొక్కాల వెనుక
ఖాకీ చెప్పుల క్రింద కనుగొను గాంధియిజం ? !
అరాచకీయ రాజకీయ
కామాంధుల చేతులలో కనుగొను గాంధియిజం ? !
అంగడి సరుకుగ న్యాయం
విక్రయించు వీధులలో కనుగొను గాంధియిజం ? !
నోట్లకు వోట్లను కొనుటకు
కోట్లు కూడబెట్టుటలో కనుగొను గాంధియిజం ? !
గాంధి తిరిగి పుట్టినా

బట్ట తిరిగి కట్టునా? కనుగొని యీ గాంధియిజం ? !                                                ...శనగల